Tag Archives: Adi Shankaracharya Telugu

జగద్గురు శ్రీ ఆదిశంకారాచార్య

adishankara1

శంకరం శంకరాచార్యo

కేశవం బాదరాయణo

నమామి భగవత్పాదం

శంకరం లోక శంకరం

శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అద్వైత వేదాంతానికి ఆద్యులు. ఆయనను శ్రీ శంకర భగవత్పాదులు అని కూడా పిలుస్తారు. వారు సుమారుగా 2500 పూర్వం కేరళలోని కొచ్చి నగర సమీపంలోని కాలడిలో జన్మించారు. అయితే శృంగేరి మొదలైన మఠాల ఆధారాల ప్రకారం ఆయన 5-6 శతాబ్దంలో జీవించినట్లు ఆధారాలు ఉన్నాయి. 8వ శతాబ్ద కాలంలో 72కు పైగా వివిధ హిందూ మతశాఖలు విజృంభించి గందరగోళం సృష్టించాయి. సుభిక్షంగా ఉన్న భారతదేశాన్ని కొల్లగొట్టడానికి విదేశీయుల దాడులు ప్రారంభమైనాయి, విదేశీ మతాలు భారత దేశoలోకి చొచ్చుకు వస్తున్నాయి. ఈ కల్లోలానికి దుఃఖించి భూమాత మొరపెట్టుకుంటే, ఆ పరబ్రహ్మతత్త్వం, భారతాన్ని ఒక్కత్రాటి మీదకి తేవడానికి, ఆది శoకరులను భూలోకానికి పంపాడని పురాణాలు చెప్తున్నాయి.

adishankara2kaladi

కాలడి

అతి పిన్నవయసులోనే ఆది శంకరులు, వేదాలు, షట్సాస్త్రాలు, షడంగాలు, సమస్త విద్యలు ఔపాసన పట్టిన మహామేధావి. మానవజాతిని సమైక్యంగా ఒక మహాతత్వానికి ఒడంబడి ఉండేటట్లు ఏవిధంగా చేయాలో అతనికి తెలుసు.

శంకరుల తండ్రి శివగురు, తల్లి ఆర్యాంబ. ఎనిమిదేళ్ళ వయసులోనే తల్లిని ఒప్పించి, సన్యాసాశ్రమ స్వీకారానికి బయలుదేరాడు. గోవింద భగవత్పాదులవారు, తమ గురువు చెప్పిన గుర్తుల ప్రకారం అతనే శివస్వరూపుడైన ఆదిశంకరులని గ్రహించి తమ శిష్యుడిగా చేసుకున్నారు.

గ్రంథములు

గోవింద భగవత్పాదుల గురుత్వంలో శంకరాచార్యులు భగవద్గీతకు, 10 ముఖ్యమైన ఉపనిషత్తులకు ( బృహదారణ్యక, ఛoదోగ్య, ఐతరేయ, తైత్తిరీయ, కెనా, ఈశా, కఠ, ముండక, ప్రశ్న, మాండూక్య), బ్రహ్మ సూత్రములకు- మహా భాష్యములు రచించారు. వేదవ్యాసుని యోగసుత్రములకు, ఆపస్థంభ ధర్మసూత్రములకు వివరణలు రచించారు.   వీటన్నిoటినీ, ముఖ్యంగా బ్రహ్మసూత్రాలను క్రోడీకరించి `అద్వైత సిద్ధాంతాన్ని’ బోధించారు. భగవద్గీతకు వ్రాసిన భాష్యం అత్యద్భుతం. వ్యాస మహర్షి స్వయంగా శంకరుల వద్దకు ఆయనను పరీక్షిoచడానికి వచ్చి భాష్యాలు విని ముగ్దులయారని ప్రతీతి. ఇంకొక ముఖ్య వేదాంత గ్రంథం `ఉపదేశ సహస్రి’.

ఆది శంకరులు రచించిన ఎన్నో స్తోత్రములలో `భజగోవింద స్తోత్రం, దక్షిణామూర్తి  స్తోత్రం, శివానందలహరి స్తోత్రం, సౌందర్యలహరి స్తోత్రం, భవానీ స్తోత్రం, కనకధారా స్తోత్రం, విష్ణు సత్పది, కృష్ణాష్టక స్తోత్రం, ఆత్మ బోధ, తత్త్వ బోధ, నిర్వాణ శతకం’  మొదలైనవి ముఖ్యమైనవి. వందల సంవత్సారాలు గడిచినా భక్తులు ఈనాటికీ ఈ స్తోత్రాల పఠనం చేసుకుంటూనే ఉంటారు.

అద్వైతం

అద్వైతం అంటే అన్ని హిందూ శాఖలకి ఆది మూలం. ఒక వృక్షం ఉందంటే, భూమిలో ప్రముఖమైన వేరు, దానికి శాఖలైన చిన్న వేర్లు ఉంటాయి; అట్లాగే భూమి పైన పెద్ద మొదలు, దాని శాఖలు కొమ్మలు రెమ్మలుగా విస్తరించి ఉంటాయి. ఊడల మర్రిచెట్టు కొమ్మలనుంచి ఊడలు నేలలోపలకు విస్తరించి వేర్లుగా మారినట్లు, హిందూ మతం కూడా కొమ్మలనుంచి వేళ్ళూనినట్లు శాఖోపశాఖలుగా విస్తరించింది. ఎన్ని రూపాలున్నప్పటికీ, పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే, అదే అద్వైత తత్త్వం. వర్షానికి వరుణుదు, వాయువు, అగ్ని, సూర్యచంద్రులు అందరూ వారి కర్తవ్యం నిర్వర్తిస్తున్నా, పంచభూతాలకి అధిపతి ఆ మహాశివుడే, అదే అద్వైతం, ద్వైత దృష్టి పరమేష్టికి లేదు.

శైవం, వైష్ణవం, శాక్తేయ తత్వాలన్నిటి గురించి ఆయన రచనలు చేసి అద్వైత వేదాంతాన్ని ఆవిష్కరించారు.  శాఖా భేదాలు పరిష్కరిస్తూ `స్మార్త’ సంప్రదాయానుసారం పంచాయతన’ పూజా విధానాన్ని నెలకొల్పి, గణపతి, సూర్య, విష్ణు, శివ, దేవీ మూర్తులను కొలుస్తూ, సకల దేవతలు ఒకే పరబ్రహ్మ స్వరూపమని విపులీకరించారు.

ఆ పిన్న వయసులోనే శిష్యులతో ఆసేతు హిమాచలం మూడు సార్లు కాలి నడకన ప్రయాణించారు. ప్రతి ముఖ్య స్థలంలో, అక్కడి హిందూ శాఖల అధిపతులతో చర్చించి అద్వైతాన్ని ప్రతిపాదించారు. గాణాపత్యులను,శైవులను, వైష్ణవులను, శాక్తేయులను, కాపాలికాది మతాచార్యులను అందరినీ ఒకే భగవంతుని నమ్మేటట్లు చేసి, వాదించి మెప్పించి అద్వైత తత్వాన్ని వ్యాప్తి చేసి, హిoదువులందరినీ ఐకమత్యంతో మెలిగేటట్లు చేసారు.  ఎందరో పండితులతో, ఇతర పీఠాలు, మఠాలతో వాదోపవాదాలు జరిపి  అద్వైత విజయకేతనం ఎగురవేశారు. వారిలో సాక్షాత్ బ్రాహ్మ, సరస్వతీ స్వరూపులైన మండన మిశ్రుడు, ఉభయభారతి ప్రముఖులు. ఆ వేదాంత తర్కానికి ఉభాయభారతి న్యాయనిర్ణేతగా ఉండాలని శంకరులే కోరారు. ఆ వాదనలో మండన మిశ్రులను ఓడించి, తన మొదటి మఠమైన శృంగేరి మఠానికి సురేశ్వరాచార్యులనే సన్యాస నామంతో ఆయనను మఠాదిపతులను చేసారు.

మఠాల స్థాపన

adishankara3sringeri

శృంగేరి శారదా పీఠం

ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మఠం చొప్పున భారతదేశానికి నాలుగు దిక్కులా నాలుగు మఠాలు నిర్మించి, తమ నలుగురు ముఖ్య శిష్యులను వాటికి పీఠాధిపతులుగా నియమించారు. ఋగ్వేదానికి తూర్పున పూరి క్షేత్రంలోని గోవర్ధన మఠానికి (`ప్రజ్ఞానo బ్రాహ్మ’ మహావాక్యం) శ్రీ పద్మపాదుల వారిని; యజుర్వేదానికి దాక్షిణాన శృంగేరి క్షేత్రంలోని శారదా పీఠానికి (`అహం బ్రహ్మాస్మి’ మహావాక్యం) శ్రీ సురేశ్వరాచార్యుడిని; సామవేదానికి పశ్చిమాన ద్వారకా క్షేత్ర పీఠానికి (`తత్త్వమసి’ మహావాక్యం) శ్రీ హస్తమలకాచార్యుడిని;  అధర్వ వేదానికి ఉత్తరాన బదరీనాథ క్షేత్రంలోని జ్యోతిర్మఠానికి (`అయమాత్మా బ్రహ్మ’ మహావాక్యం) శ్రీ తోటకాచార్యులను నియుక్తులను చేసారు. ఈ విధంగా మఠాలు స్థాపించి ఆది శంకరులు తాము  స్వయంగా కాంచీపురంలో నివాసమున్నారు.

అతి చిన్నవయసులో, తమ 32వ సంవత్సరoలో కైలాస గమనం తరువాత శ్రీ ఆది శంకరాచార్యులవారు తమ శిష్యులకి కనపడలేదు. పరమశివ స్వరూపులైన శంకరులు పరమేశ్వరునిలో కలిసిపోయారు. సద్గురువుల ఉపదేశానుసారం తమ ఉన్నతికి ప్రయత్నించడం ప్రజల కర్తవ్యం.

శంకరస్య చరితా గానం / చంద్రశేఖర గుణానుకీర్తనం //

నీలకం తవ పాద సేవనం / సంభవంతు మమ జన్మజన్మని //     

–  పి. విశాలాక్షి