Tag Archives: PDSU

ఇదీ జార్జిరెడ్డి నిజస్వరూపం

బూటకపు కధనాలు, అసత్య ప్రచారాలకు పేరుగాంచిన కమ్యూనిస్ట్ ప్రచార యంత్రాంగం ఈసారి తెలంగాణాలో అటువంటి మరో అసత్య ప్రచారానికి తెరతీస్తోంది. జార్జ్ రెడ్డి అనే హింసావాదిని ఒక హీరోగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది.
జార్జిరెడ్డి జీవితం ఇతివృత్తంగా నిర్మించిన చలన చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో దానిని ప్రోమోట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ మార్కెటింగ్ ప్రణాళికలో భాగంగా ఇటీవల హన్స్ ఇండియా వంటి పత్రికలతో పాటు సామాజిక మాధ్యమ గ్రూపులలో అతనిని కీర్తిస్తూ వ్యాసాల పరంపర మొదలైంది. కొన్ని వ్యాసాల్లో అతడిని ఏకంగా సమాజోద్ధారకుడుగా అభివర్ణించారు.ఈ నేపథ్యంలో జార్జిరెడ్డి జీవితంలో మీడియా మనకు చూపని చీకటి కోణాన్ని మీ ముందుంచే ప్రయత్నం ఇది:

ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి ప్రస్థానం:

1969-70 మధ్యకాలంలో అర్జెంటీనా మార్క్సిస్ట్  చే గువేరా అడుగుజాడల్లో నడవాలనుకునే ఒక విద్యార్ధి బృందం ఏర్పడింది. దీనికి జార్జిరెడ్డి నేతృత్వం వహించాడు.

జార్జిరెడ్డి తల్లి కేరళ క్రిష్టియన్, తండ్రి చిత్తూరు ప్రాంతానికి చెందినవాడు. జార్జిరెడ్డి 8 ఏళ్ల వయసున్నప్పుడే అతడి తల్లిదండ్రులు విడిపోవడంతో ఆ కుటుంబ పరిస్థితుల ప్రభావం అతడిపై తీవ్రంగా ఉండేది.

కాలేజీ రోజుల్లో నక్సలిజం ఉద్యమానికి ఆకర్షితుడైన జార్జిరెడ్డి మార్క్సిజం గురించి అధ్యయనం చేశాడు. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులకు జార్జిరెడ్డి స్వయంగా నకుల్ డస్టర్, కత్తులు, ఇతర పదునైన మారణాయుధాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చాడు. తమ సైద్ధాంతిక మూలాలు బయటపడకుండా ఉండడం కోసం ఈ బృందం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్.ఎస్.యు.ఐ తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆవిధంగా కాంగ్రెస్ నాయకుల అండదండలు కూడా పొందగలిగారు. అలా పనిచేస్తూ చే గువేరా హింసాయుత సిద్ధాంతాన్ని విద్యార్థులకు భోధించేవాడు. ఎన్.ఎస్.యు.ఐ వంటి కాంగ్రెస్ అనుబంధ సంస్థల ద్వారా తమ పొత్తును కొనసాగిస్తూ రాజకీయంగా తమ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నం ఆరోజుల్లోనే ఉంది.

హింసాయుత నక్సల్ సిద్ధాంతమే స్ఫూర్తిగా:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళంలో సాయుధ తిరుగుబాటు జరుగుతున్న సమయమది. 1968 – 72 మధ్య నాలుగు సంవత్సరాల పాటు జరిగిన ఈ హింసాత్మక ఘటనలో 156 మంది ప్రజలను ‘వర్గ శత్రువులు’గా పేర్కొంటూ నక్సలైట్లు తుదముట్టించారు. అది ఆనాటి హింసాత్మకతకు నిదర్శనం. ప్రముఖంగా మహిళలు, పిల్లలు ఈ హింసావాదానికి బలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మధ్యయుగం నాటి క్రూరాత్మక ఘటనలను తలపించే విధంగా బాధితులు కోర్టుల్లో సాక్ష్యం చెప్పేందుకు కూడా భయపడే వాతావరణం సృష్టించారు. ప్రత్యర్ధులను హత్యచేసి, వారి అవయవాలను ముక్కలుగా కోసి వారి ఇంటికే వేలాడదీసేవారు. తలలను తెగనరికి వెదురు కర్రలకు వేలాడదీసి ఇంటి ఎదుట పాతేవారు. ‘నిందితులు’గా తాము ముద్రవేసినవారిని కుటుంబ సభ్యుల ముందే హింసించి కిరాతకంగా హత్యచేసేవారు. అలా చంపినవారి రక్తంతోనే గోడలపై `విప్లవ’ నినాదాలు రాసేవారు.

జార్జిరెడ్డి – క్రూరమైన హింసా ప్రవృత్తికి ప్రతిరూపం:

“నీ చేతులు వర్గశత్రువు రక్తంతో తడవనంతకాలం నువ్వు నిజమైన కమ్యూనిస్టువి కావు”

–  శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు రాసిన ‘మావోయిజం’ అనే పుస్తకంలోని ఈ నినాదాన్ని జార్జిరెడ్డి తన బృందంలోని విద్యార్థులను హింసవైపు ప్రేరేపించేందుకు ఎంచుకున్నాడు.
1968 నుండి జార్జిరెడ్డిపై 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 1970లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇద్దరు న్యాయవిద్యార్ధులపై హత్యాప్రయత్నం చేశాడు. అంతకు పూర్వం వరకు ఆంధ్రప్రదేశ్ లోని ఏ యూనివర్సిటీ ప్రాంగణంలోనూ ఇటువంటి హింసాత్మక ఘటన జరగలేదు. ఇది యూనివర్సిటీ విద్యార్థులలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూనివర్సిటీ అతడిని బహిష్కరించింది. కానీ కొన్ని వారాల్లోపే కొన్ని ఒత్తిళ్ల కారణంగా జార్జిరెడ్డి బహిష్కరణ నిర్ణయాన్ని యూనివర్సిటీ వెనక్కి తీసుకుంది.అప్పటికి జార్జిరెడ్డి విద్యార్థి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ  ప్రచారం మొదలైంది. కానీ నిజానికి అతను గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. 1970లో ఏబీవీపీ హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల విద్యార్థి ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ సైన్స్ కాలేజీ ఎన్నికల్లో జార్జి రెడ్డి నిలబెట్టిన అభ్యర్ధి ఓటమిపాలయ్యాడు కూడా. దీనితో ఏబీవీపీ పై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు విద్యార్ధులందరికి ఒక `గుణపాఠం’ నేర్పాలని జార్జ్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.

ఓయూ ప్రాంగణంలో జార్జిరెడ్డి వీరంగం:

1971లో జార్జిరెడ్డి తన బృందంతో జీపులో తిరుగుతూ విద్యార్థులలో భయాందోళనలు సృష్టించేవాడు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఏబీవీపీ విద్యార్థి సి.హెచ్. నరసింహారెడ్డిని ఓయూ హాస్టల్ నుండి బయటకు లాగి, హాకీ బ్యాట్లు, ఇనుప రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అప్పటి లా కళాశాల యూనియన్ ప్రెసిడెంట్ సి.హెచ్. విద్యాసాగర్ రావుపై దాడి చేసిన జార్జ్ రెడ్డి బృందం చేసిన దాడిలో దవడ ఎముకలు విరిగి, బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఏబీవీపీ నాయకుడు నారాయణ దాసును ఏకంగా ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. చివరికి చనిపోయాడనుకుని ఒక నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేసి పోయారు. అప్పటి ఏబీవీపీ హైదరాబాద్ నేతతో ఎన్. ఇంద్రసేనారెడ్డితో పాటు సూరదాస్ రెడ్డి, మరికొందరు విద్యార్ధులపై కూడా ఇలాంటి దాడే జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి హింసాత్మక ఘటనలను చూసీచూడనట్టు వ్యవహరించింది. దానితో ఏబీవీపీ విద్యార్థులే లక్ష్యంగా జార్జిరెడ్డి హింసాత్మక చర్యలు మరింత పెరిగాయి.

జార్జిరెడ్డి మరణం.. అనంతర పరిణామాలు:
1972 ఏప్రిల్ 14న విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడే జార్జిరెడ్డి తన బృందంతో కలిసి ఇంజనీరింగ్ హాస్టల్ మీద దాడిచేశాడు. జార్జిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి కాదు, ఆ కళాశాల హాస్టల్ కు అతడికి సంబంధం కూడా లేదు. జార్జిరెడ్డి వర్గానికి వ్యతిరేకంగా పోటీచేస్తున్న విద్యార్థి నివసిస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లోకి వెళ్లాల్సిన అవసరం అతడికి ఏమొచ్చింది?

ఆ సమయంలో అక్కడ జరిగిన ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయాడు.

మరుసటి రోజు దినపత్రికలలో ‘ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి నేత జార్జిరెడ్డి మరణం వెనుక ఏబీవీపీ, ఆరెస్సెస్’ అని ఆరోపిస్తూ వార్తలు వచ్చాయి. విచిత్రమేమిటంటే ఏ పత్రికా జార్జిరెడ్డి నేరచరిత్రను కనీసం ప్రస్తావించలేదు. విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీని పూర్తిగా తుదముట్టించేందుకు ఇదొక అవకాశంగా కాంగ్రెస్ ఈ హత్యను ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది.

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జార్జిరెడ్డి మృతదేహాన్ని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉంచి, వ్యతిరేక నినాదాలిస్తూ, కార్యాలయ గేట్లు దూకి లోపలికి చొరబడే ప్రయత్నం చేసారు. క్రైస్తవ మతం స్వీకరించిన మాజీ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి జార్జిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన దాదాపు 175 మంది ఎంపీలు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి ఆరెస్సెస్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మెమోరాండం సమర్పించారు. కానీ అసలు నిజం ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగానికి జార్జిరెడ్డి నేర చరిత్ర సుపరిచితమే.

ఏబీవీపీ విద్యార్ధులపై నేరారోపణ – హైకోర్టు క్లీన్ చిట్:

ఈ హత్యకేసులో 9 మంది విద్యార్ధులపై చార్జిషీట్ నమోదైంది. 6 నెలలపాటు జైలులో ఉన్న వీరిని ట్రయిల్ కోర్ట్ నిర్దోషులుగా విడుదల చేసింది. వారి విడుదల రోజు ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థులు ఓయూ ప్రాంగణంలో “కోర్టులు కాదు, మేము బహిరంగ తీర్పు చెప్పి శిక్షీస్తాం” అంటూ నినాదాలిచ్చారు. ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్ధించింది. ఈ న్యాయపోరాటంలో ఏబీవీపీ కార్యకర్తలు ఎంతో వేదనకు, కష్టాలకు గురయ్యారు.

ముగింపు:

కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం..  గత రెండు దశాబ్దాలలో (1998-2018) జార్జిరెడ్డి ఆశయసాధన కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే సంస్థలు సాగించిన మారణహోమంలో దాదాపు 12000 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 8000 మంది సాధారణ పౌరులున్నారు. బీబీసి వార్తా సంస్థ సర్వే ప్రకారం జార్జిరెడ్డి హింసాత్మక సిద్ధాంతానికి బలైన వ్యక్తుల సంఖ్య 6000.

ఇలాంటి నేర చరిత్ర, ద్వేషం, విధ్వంస స్వభావం కలిగిన వ్యక్తులను వీరులుగా, హీరోలుగా కీర్తించే ప్రయత్నాలను సమాజం మేలు కోరుకునేవారు అడ్డుకునే తీరాలి.

English Original link

Sources :

  • ‘Seven Decades My Journey with an Ideology’ by Prof S.V.Seshagiri Rao.
  •  Struggle Against Nation Splitters
  • BBC report : 1st July 2010
  • MHA : 1st Oct 2017
  • South Asian Terrorism Portal
  • Archive – Jagriti Weekly, 1972