దేశవిదేశాలలో ప్రఖ్యాతిగాంచి, కోట్లాదిమంది అభిమానించే బహుభాషా గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, ఆంకర్ పద్మభూషణ్ శ్రీ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యo తమ వదాన్యతను, భారతీయ వేదవిజ్ఞ్యానం సంస్కృతులపై తమ భక్తిని చాటుకున్నారు. 40వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డులలో నమోదైన మన తెలుగు వెలుగు, నాలుగు భాషలలో 6 జాతీయ అవార్డులు గెలుచుకున్న ఏకైక గాయకుడు. సినిమా పాటలే గాక, ఆయన ప్రైవేటుగా వెలువరించిన భక్తి సంగీతం, స్తోత్రాలు, పద్యాలు కూడా మనకు సుపరిచితమే.

ఈ గాన గంధర్వుడు ఆంధ్రప్రదేశ్ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు పట్టణం, తిప్పరాజు వారి వీధిలోని తమ సొంత ఇంటిని, వేద పాఠశాల నిర్వహణ కోసం, శ్రీ కంచి కామకోటి పీఠాదిపతులు స్వామి శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి గారికి 12ఫిబ్రవరి 2020 తేదీన సమర్పించారు. కంచి పీఠాదిపతికి శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి, భగవంతుడిని స్మరిస్తూ పద్యాలను గానం చేసి, వారికి తమ ఇంటి పత్రాలను అందించారు. వేద పాఠశాల నిర్వహణపై తదుపరి విషయాలు తర్వాత తెలియచేస్తామని కంచికామకోటి పీఠo వారు తెలియచేసారు. శ్రీ బాలుగారు ఇటువంటి పుణ్యకార్యo చేయడం అభినందనీయం. ఒకప్పుడు వారి తండ్రి గారు శ్రీసాంబమూర్తి గారు హరికథా భాగవతోత్తమునిగా, త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించిన సంగీతకారునిగా నెల్లూరులో సుప్రసిద్ధులు. శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి, శ్రీ బాలుగారిని అభినందిస్తూ, భారతీయ వేద వాంగ్మయo, చరిత్ర ఇతిహాసాలను, శాస్త్రీయ సంగీతాలను గురించి తెలుసుకోవడం నేర్చుకోవడం మన కర్తవ్యo అని తెలిపారు.