Author Archives: surenderknt

తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన “మైనార్టీల సంక్షేమ దినం” ఎవరి కోసం?

ఇటివల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చాప కింద నీరులాగా ప్రవహిస్తూ సమీప భవిష్యత్తులో మతం ఆధారంగా ప్రజల మధ్య ఛీలికలు తీసుకొని వచ్చే విధంగా ఉన్నాయి. ప్రజల నుండి ఎలాంటి కోరిక/ఒత్తిడి లేకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు గారు దేశ తొలి విద్యా శాఖామాత్యులు అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని నవంబర్ 11 ను “మైనార్టీల సంక్షేమ దినం” గా ప్రకటించారు.

అందుకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో “మైనారిటీస్ వెల్ఫేర్ డే” ఉత్సవాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేవలం ముస్లింలను లక్షంగా చేసుకొని నిర్వహించడం జరిగింది అనే చెప్పడానికి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి జాబితా చూస్తే అర్ధం అవుతుంది.

మన దేశంలో మైనారిటీలు అంటే కేవలం ముస్లిం మతస్తులు అనే సమానార్ధకం తీసుకొనే వచ్చే విధంగా వ్యవహిరస్తున్నారు. కాని ఇలాంటి కార్యక్రమాలు అధికారికంగా జరిగినప్పుడు కొన్ని ప్రశ్నలు సహజంగానే ఉత్పన్న అవుతాయి. అందులో, “మైనార్టీల సంక్షేమ దినం” ఎవరిని ఉద్దేశించి నిర్వహించడం జరుగుతుంది? జనాభా పరంగా తక్కువ సంఖ్యలో  ఉన్నవాళ్ళ మైనార్టీలు అంటే నిర్దిష్టంగా ఎవరు? కేవలం ముస్లింలు మాత్రమేనా? అట్లా అయితే క్రైస్తవులు, జైనులు, పార్సీలు జనాభా ప్రకారం మైనార్టీలు కాదా? మైనార్టీ అనే పదాన్ని రాజకీయ నాయకులు తమ స్వలాభం కొరకు కేవలం ఒక మతం వారిని మాత్రమే పరిగణిస్తూ, వారిని మిగితా సమాజం తో కలవకుండా, ప్రత్యేక అవకాశాలు అనే పేరుతో వారిని ఒక వోట్ బ్యాంక్ లాగా ఏర్పాటు చేసుకొనే వ్యూహం కాదా? ఇలాంటి విభజన రాజకీయాలు దేశానికి మంచివి కావు అని చరిత్ర హెచ్చరిస్తున్నా కొత్తగా ప్రవేశ పెట్టడంలో ఉన్న అంతరార్ధం ఏంటిది?

ఈ రోజును కేవలం మైనార్టీల సంక్షేమ దినంగా పేరుతో ముస్లింలను దగ్గరకు తీస్తే, రేపు క్రైస్తవులు తమ నచ్చిన రాజకీయ నాయకుడి జయంతిని “క్రైస్తవ మైనార్టీ సంక్షేమ దినం”గా ప్రకటించమంటే ఏమి చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ క్యాలండర్ లో “మెజారిటీ సంక్షేమ దినం” కూడా ఉంటుదా?

ఇటివల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలలు అనే పేరుతో విద్యలో సైతం మైనారిటీ /మోజారిటీ అనే భేదభావంతో విద్య వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొని రావడం జరిగింది. వాటిలో 71 రెసిడెన్షియల్ స్కూల్స్ ను కేవలం మైనారిటీ వారికి అంటూ నిర్వహిస్తుంది. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలు భవిషత్తు తరాలవారి విశాల ఆలోచనలకూ గొడ్డలి పెట్టు లాంటింది కాదా? ఈ పాఠశాలలో చదువుకున్నవారికి మిగితా సమాజం తో ఎలాంటి సత్సంబంధాలు ఉండవచ్చు, ఎవరైనా కావాలని అపోహలు కల్గిస్తే వాటి పరిణామాల వలన ఆ విద్యార్థుల ఆలోచన కుచించుకొనిపోదా?

ప్రస్తుతం మన సమాజంలో కులం, మతం పేరుతో విషబీజాలు నాటుతున్న వారు విశ్వవిద్యాలయాలో చాలామంది మేధావులుగా గుర్తించబడుతున్నారు. సమాజంలో అందరు సమాన భాగస్వాములే, కాని సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఇప్పటికే ఉన్న అంతరాలను తగ్గించడానికి ప్రయత్నించకుండా వాటినే ఆధారంగా చేసుకొని చీలికలు తీసుకొని రావడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాల వలన ముందు తరాల వాళ్ళకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన బిజాలు పడుతున్నాయి

ఒకవైపు ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా కర్ణాటక ప్రభుత్వం ఒక నిరంకుశ రాజు అయిన టిపు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించుతుంటే, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా విభజన రాజకీయాలు అధికార హోదాలో చేయడం ప్రజలు అందరు ఖండించవలసిన అంశం.

Surender