Tag Archives: Swami Vivekananda on caste

భారత దేశంలో కుల సమస్యపై స్వామి వివేకానంద

`ప్రపంచానికి నేనొక సందేశం ఇవ్వాలి, అది నేను భయం, భవిష్యత్తు గురించి జాగరూకత లేకుండా చెప్పదలుచుకున్నాను. సంఘ సంస్కారులతో, నేను వారికన్నా పెద్ద సంస్కరణవాదినని చెప్పగలను. వారికి చిన్న చిన్న సంస్కరణలు కావాలి, నాకు వేర్లు కొమ్మలతో సహా సంస్కరణ కావాలి’.

 భారత దేశంలో కుల సమస్య

 కులం సంఘంలో ఉంది, మతంలో కాదు

 మన కులాలు, సంస్థలకి, మతంతో సంబంధం ఉన్నట్లు కనిపించినా, అది నిజం కాదు. ఒక దేశంగా మనని పరిరక్షించడానికి ఈ వ్యవస్థ అవసరమైంది, స్వయం-పరిరక్షణ అనే అవసరం తీరిపోయినపుడు, అవి వాటంతటకి అవే నశిoచిపోతాయి. మతంలో కులం లేదు. ఒక అగ్రకుల వ్యక్తి, ఒక నిమ్నకుల వ్యక్తి సన్యాసి /స్వామి కావచ్చు, అపుడు ఆ రెండు కులాలు సమానమే. వేదాంత మతానికి కుల వ్యవస్థ వ్యతిరేకం.

కులం ఒక సాంఘిక ఆచారం, మన గురువులు అందరు దానిని  కూలదోయడానికి ప్రయత్నిoచారు. బౌద్ధమతం నుంచి, ప్రతి శాఖ, సాంప్రదాయం కులవ్యవస్థకి వ్యతిరేకంగా బోధించాయి, కాని ప్రతిసారి సంకెళ్ళు మరింత బిగుసుకున్నాయి. గౌతమ బుద్ధుడినుంచి రామ్మోహన్ రాయ్ వరకు అందరూ పొరపాటుగా కులాన్ని మత వ్యవస్థలో భాగంగా చూసి, మతo కులo రెంటిని సమూలంగా దిగజార్చడానికి ప్రయాసపడ్డారు, ఓడిపోయారు.

మతాధికారులు ఎంత ఆవేశంగా దురుసుగా మాట్లాడినా, కులo- పటిష్టంగా ఏర్పడిన సాంఘిక వ్యవస్థ మాత్రమే. కులం  ప్రయోజనం పూర్తి అయింది కాబట్టి, అది కేవలం ఇపుడు, దుర్గంధంతో భారతదేశ వాతావరణంలో కాలుష్యం కలగజేస్తోంది. ప్రజలకు వారు కోల్పోయిన సామాజిక అస్తిత్వం తిరిగి ఇవ్వగలిగితే, కులాన్ని పూర్తిగా పారదోలవచ్చు. దేశ రాజకీయ వ్యవస్థల అపరిమిత పెరుగుదలే కులం, అది ఒక వారసత్వ వాణిజ్య సంఘం. బోధనల కన్నా ఎక్కువగా యూరోప్ తో వాణిజ్య పోటి కులాన్ని ఛేదిస్తోoది.

 కులవ్యవస్థకు  అధారితమైన యోచన

 నా వయసు పెరుగుతున్నకొద్దీ, భారతదేశంలో కులం మరియు ఇతర అనాది కాలంగా ఉన్న వ్యవస్థల గురించి, నా అవగాహన పెరుగుతోంది. ఒకప్పుడు ఇవన్నీ పనికిరానివి, అర్ధంలేనివి అనిపించేది, కానీ నేను పెద్దవుతున్నపుడు, వాటిని దూషించడంలో తేడా కనిపిస్తోంది, ఎందుకంటే ఈ వ్యవస్థలు శతాబ్దాల అనుభవానికి ప్రతిరూపాలు.

నిన్న పుట్టిన పిల్లవాడు, రేపోమాపో చనిపోబోతున్నవాడు, నా దగ్గరకు వచ్చి నా ప్రణాళికలన్నీ మార్చుకోమంటే, ఆ బాలుడి మాట విని, అతని ఊహల ప్రకారం నేను నా పరిసరాలన్నీ మార్చేస్తే, నేను మూర్ఖుడినవుతాను. ఇతర దేశాలనుంచి మనకి వస్తున్న సలహాలు ఇలాంటివే. ఆ పండితులకి ఇలా చెప్పండి “మీరు మీకోసం ఒక స్థిరమైన సమాజం ఏర్పరుచుకుంటే, అపుడు మీ మాట వింటాను. ఒక ఆలోచనను రెండు రోజులు కొనసాగించలేక, మీలో మీరే పోట్లాడుకుని ఓడిపోతున్నారు. వసంతంలో పుట్టిన శలభాల్లాగా, అయిదు నిముషాల్లో నశిస్తున్నారు. నీటి బుడగల్లాగా పుట్టి, బుడగల్లాగే చెదిరిపోతున్నారు.  ముందుగా మాలాగా స్థిరమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోండి, శతాబ్దాలుగా ఉన్నా, చెక్కుచెదరని, వాటి శక్తి కోల్పోని చట్టాలు వ్యవస్థలు తయారు చేసుకోండి. అప్పుదు మీతో మాట్లాడే సమయం వస్తుంది, అప్పటిదాకా, నా స్నేహితులారా, మీరు చిన్న పిల్లలు మాత్రమే”.

కులం మంచిది, ఈ ప్రణాళిక మేము అనుసరించదలుచుకున్నాము. కోటిమందిలో ఒక్కడు కూడా, కులం ఏమిటన్నది అర్ధం చేసుకోలేదు. ప్రపంచంలో కులం లేని దేశం ఏదీలేదు. ఆ సూత్రం మీదే కులం అధారపడి ఉంది. భారతదేశంలో ప్రణాళిక అందరినీ బ్రాహ్మణులుగా తయారు చేయాలనే, మానవాళికి ఆదర్శం బ్రాహ్మణ్యం. భారతదేశ చరిత్ర చదివితే, క్రింది తరగతులవారిని పైకి తేవాలనే ప్రయత్నం ఎల్లపుడూ కనిపిస్తూనే ఉంటుంది. చాలా తరగతులవారు ఆ విధంగా పైకి రాగలిగారు. అన్ని తరగతులు, మొత్తం సమాజం బ్రాహ్మణo అయేదాకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అదే ప్రణాళిక.

ఆధ్యాత్మిక సంస్కృతికి, త్యాగానికి ఆదర్శం బ్రాహ్మణ్యం. ఆదర్శ బ్రాహ్మణo అంటే నా ఉద్దేశం ఏమిటి? బ్రాహ్మణ తత్వం  అంటే ప్రాపంచిక దృష్టి లేకుండా, సత్యమైన వివేకం అపారంగా కలిగి ఉండడం. అదే హిందూ జాతికి ఆదర్శం. చట్టo పరిధిలో రాకుండా, అసలు శాసనమే లేకుండా, రాజుల పాలన క్రిందకి రాకుండా, శరీరానికి హాని కలగకూడని వ్యక్తి బ్రాహ్మణుడనే మాట మీరు వినలేదా? అది సత్యం. కావాలని ఉద్దేశపుర్వకంగా మాట్లాడే అజ్ఞ్యానుల అర్ధంతోకాక, నిజమైన మూల వేదాంత భావనతో అర్ధం చేసుకోండి.

స్వార్థం పూర్తిగా తొలగించి, జ్ఞ్యానం వివేకం ప్రేమ ఆర్జించి అందరికి పంచే జీవనం కల  వ్యక్తులే బ్రాహ్మణులైతే, మొత్తం దేశం ఇటువంటి  బ్రాహ్మణులతో నిండిఉంటే, వారు అధ్యాత్మికత నైతికత మంచితనం కలిగిన స్త్రీ పురుషులైతే, అటువంటి దేశం మామూలు చట్టాలు, శాసనాల పరిధి దాటిఉంటుంది అనడంలో వింత ఏముంది?  వారిని శాసించడానికి పోలీసులు, సైన్యం అవసరం ఏముంది? అసలు వారిని ఎవరైనా ఎందుకు పాలించాలి? ఒక ప్రభుత్వం కింద వారు ఎందుకు ఉండాలి? వారు మంచివారు, ఉత్తములు, భగవంతునికి చెందినవారు; వీరు మన ఆదర్శ బ్రాహ్మణులు. సత్యయుగంలో ఒక్క బ్రాహ్మణ కులం మాత్రమే ఉండేదని చదువుతాము. ఆదికాలంలో ప్రపంచమంతా బ్రాహ్మణులే ఉండేవారని, వారు పతనమౌతున్నకొద్దీ, అనేక కులాలుగా విడిపోయారని మనం మహాభారతంలో చదువుతాము. అలాగే ఆ వృత్తo పూర్తయితే, మళ్ళీ మానవజాతి బ్రాహ్మణ మూలాలకే చేరుకుంటుంది,

బ్రాహ్మణుడి కొడుకు బ్రాహ్మణుడే అవడు, అతను బ్రాహ్మణుడు అవడం ఎన్నో విధాలుగా సాధ్యమే అయినా, అతను అవకపోవచ్చు. బ్రాహ్మణ కులం, బ్రాహ్మణ తత్త్వం రెండు వేరు విషయాలు.

ప్రతి మానవుడిలో, సత్త్వ రజస్ తామస గుణాలు- ఎదో ఒకటి గాని, అన్నీ గాని – హెచ్చు తగ్గుల్లో ఉంటాయి, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా తయారయే లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఏ సమయంలోనైనా, ఎదో ఒక లక్షణం ప్రదానoగా కనపడి ప్రస్ఫుటమౌతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి అదాయంకోసం ఇంకొకరికి సేవ చేస్తే, అది శూద్రత; అదే వ్యక్తి వ్యాపారలాభం కోసం ఎదోఒక  పనిచేస్తే, అపుడతను వైశ్యుడు; అన్యాయాన్ని ఎదిరిస్తే అపుడతను క్షత్రియుడు; భగవంతుడి ధ్యానంలో, సంభాషణలో ఉంటే అపుడతను బ్రాహ్మణుడు. కాబట్టి, ఒక కులం నుంచి ఇంకొక కులానికి మారడం సాధ్యమే. లేకపోతే విశ్వామిత్రుడు బ్రాహ్మణుడెట్లా అయాడు, పరశురాముడు క్షత్రియుడు ఎలా అయాడు?

యూరోపియన్ నాగరికతకు ఆధారం కత్తి అయితే, భారత నాగరికతకు ఆధారం వర్ణ విభజన. విజ్ఞ్యానం సంస్కృతి, తద్వారా నాగరికత పెంపొందించుకుంటూ పైపైకి మానవుడు ఎదగడమే వర్ణ-ఆధారిత వ్యవస్థ. బలవంతుడి గెలుపు, బలహీనుడి ఓటమి యూరోప్ లక్షణం. భారత భూమిలో ప్రతి సామాజిక నియమం, బలహీనుల రక్షణకై ఏర్పాటు చేయబడింది.

మానవుడిని- ప్రశాంత, నిశ్చల, స్వచ్చ, ధ్యానపూరిత అనగా- ఆధ్యాత్మిక మానవునిగా తీర్చిదిద్దడానికి, సమస్త మానవాళిని ఆ దిశగా సౌమ్యతతో నడిపించడమనే ఆదర్శం కులం. భగవంతుడు ఆ ఆదర్శంలో భాగమై ఉన్నాడు.

భారతీయ కులం, భగవంతుడు అందజేసిన గొప్ప సామాజిక వ్యవస్థ అని మేము నమ్ముతాము. అనివార్య లోపాలు, విదేశీయుల ఆక్రమణ- యుద్ధాలు, చాలామంది బ్రాహ్మణుల(ఆ పేరుకి అర్హత లేని వారు) అజ్ఞానం అహంకారం మొదలైన లోపాలు, ఈ ఉన్నతమైన భారతీయ కుల వ్యవస్థను పక్కదారి పట్టించి, మనకు అందాల్సిన ఫలితాలు అందనివ్వకుండా చేసాయి. ఈ భారత భూమిలో ఈ కుల వ్యవస్థ వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఇది భారతజాతిని తన గమ్యానికి చేర్చేది.

కులం నిష్క్రమించగూడదు, కాని మార్పులు చేర్పులు జరగాలి. ఆ పాత కట్టడంలోనే రెండు లక్షల రకాల కొత్త వాటి నిర్మాణానికి కావాల్సిన జీవం ఉంది. కుల నిర్మూలన కోరడంలో అర్ధంలేదు.

 పరపతి అధికారాల అసమానత వ్యవస్థను కలుషితం చేస్తుంది  

వివిధ వర్గాలుగా సముదాయాలుగా ఏర్పడడం సమాజ ప్రకృతి.  కులం సహజ క్రమం. సామాజిక జీవనంలో నేనొక పని చేస్తాను, నువ్వు ఇంకొకటి చేస్తావు.  నేను చెప్పులు కుట్టగలను, నువ్వు దేశాన్ని ఏలగలవు; అంత మాత్రాన, నువ్వు నాకన్నా గొప్పవాడివని కాదు, ఎందుకంటే నువ్వు నాలాగా చెప్పులు కుట్టగలవా? నేను దేశాన్ని ఏలగలనా? కాని ఆ కారణంగా నువ్వు నా మీద పెత్తనం చేయలేవు. ఒకడు హత్య చేస్తే అతనిని పొగిడి, ఇంకొకడు ఒక పండు దొంగతనం చేస్తే, అతనిని ఉరితీయడం ఎందుకు? ఇది సరికాదు, ఇది తోసివేయాలి.

కులం మంచిది, అది సహజ జీవన పరిష్కారం. ఎక్కడైనా జనం సముదాయాలుగా ఏర్పడతారు, ఇది తప్పించలేము. ఎక్కడికెళ్ళినా కులం ఉంటుంది, కాని దాని అర్ధం ఈ పరపతి అధికారాలు ఉండాలని కాదు. ఇవి పడగొట్టాలి. ఒక మత్స్యకారుడికి వేదాంతం బోధిస్తే, అతను `నువ్వెలాంటి మనిషివో నేను అంతే, నేను మత్స్యకారుడిని, నువ్వు తత్వవేత్తవు, నీలో ఉన్న దేవుడే నాలొనూ ఉన్నాడు’ అని అంటాడు. అదే మనకు కావాలి, ఎవరికీ ఏ అధికారాలు పరపతులు ఉండకూడదు, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి; ప్రతి మానవుడిలో పరమాత్మ ఉన్నాడని, వారు తమ మోక్ష మార్గాలు తెలుసుకుంటారని, అందరికి బోధించాలి. ప్రత్యేక అధికారాలు, పరపతులు ఉన్న రోజులు శాశ్వతంగా భారత భూమిలోoచి పోయాయి.

అస్పృశ్యత- మూఢనమ్మకాల కూడిక

ఒకప్పుడు ఉన్నత మనస్కుల లక్షణం ఇది – “త్రిభువనముపకార శ్రేనిభిత్ ప్రియమనః”- `అనేక సేవలతో సంపూర్ణ విశ్వాన్ని ఆనంద పరుస్తాను’, కాని ఇపుడు- `నేను ఒక్కడినే స్వచ్చమైన పవిత్రుడిని, సమస్త ప్రపంచం అపవిత్రం’, `నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు’! భగవాన్! ఈ కాలంలో, పరబ్రహ్మ -హృదయంలో, ఆత్మలో లేడు, అనంతలోకాల్లో లేడు, సమస్త జీవరాసుల్లో లేడు- ఇపుడు  దేవుడు వంట గిన్నెల్లో ఉన్నాడు!

మనం `ఛాందస’  హిందువులం, కాని `అంటరానితనం’ మనo ఒప్పుకోము. `అంటరానితనం’ హిందూ మతం కాదు, మన గ్రంథాల్లో ఇది లేదు. ఇది ఒక ఛాoదస మూఢనమ్మకo, మన దేశ సామర్థ్యాన్ని చాలాకాలంగా ఇది దెబ్బ తీస్తోంది. మతం వంటగిన్నెల్లోకి ప్రవేశించింది. హిందువుల ప్రస్తుత మతం జ్ఞ్యానమార్గం కాదు, హేతుమార్గం కాదు, కేవలo   `నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు’ మాత్రమే.

ఈ `అంటరానితనం’ ఒక మానసిక రుగ్మత. జాగ్రత్త! విస్తృతి జీవం, సంకోచం సంకుచితం మరణం. ప్రేమ విస్తృతి, స్వార్థం సంకోచం. కాబట్టి ప్రేమ మాత్రమే జీవన సూత్రం. హిందూ మతమే కాని ఈ అనాచార `అంటరానితనానికి’ మీ జీవితాలను కోల్పోవద్దు. `ఆత్మాయాత్ సర్వభూతేషు’- `సమస్త ప్రాణులు  నీవు అనే భావించు’ అనే బోధన గ్రంథాలకే పరిమితం కావాలా? ఆకలితో ఉన్నవారికి ఒక రొట్టె పెట్టలేని వాడికి మోక్షం ఎలా సిద్ధిస్తుంది? ఇంకొకరి గాలి సోకితేనే మైలపడేవారు, ఇతరులను ఎలా శుద్ధి చేయగలరు?

ఇతరులను క్రూరంగా చూడడం మానేయాలి. ఎంత అసంబద్ధమైన స్థితికి వచ్చాము! ఒక భంగీ (అప్పటి అంటరాని కులం) ఎవరి దగ్గరికైనా వస్తే, అతన్ని దూరంగా పెడతారు. ఒక చర్చ్ పాస్టర్ అతని నెత్తిన నీళ్ళు పోసి, ఎదో ప్రార్థన చేసిన తర్వాత, అతనే ఒక చింపిరి కోటు తొడుక్కుని గదిలోకి వస్తే, అదే `ఛాoదస’ హిందువు, కుర్చీ వేసి కరచాలనం చేస్తాడు! ఇంతకన్నా విచిత్రమైన అసంబద్ధత ఏమైనా ఉంటుందా.

సానుభూతి దొరకక, వేలాదిమంది `అంటరానివారు’ మద్రాసులో మతం మార్చుకుని క్ర్రిస్తియన్లు అవుతున్నారు. కేవలం ఆకలి తీర్చడం కోసమే అనుకోకండి, వారికి మననుంచి ఎటువంటి సానుభూతి దొరకక. మనం రాత్రి పగలు `నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు’ అని మాత్రమే అంటున్నాము. దయ జాలి ఉన్న హృదయాలు ఈ దేశంలో ఉన్నాయా?  ఈ `ముట్టుకోవద్దు’ మూడాచారాలను తరిమి కొట్టండి!  ఈ `అంటరానితనం’ అడ్డంకులను బద్దలుకొట్టి, `అందరు రండి, పేద దీన బడుగు ప్రజలారా’ అని గొంతెత్తి పిలిచి అందరినీ ఒక దగ్గరికి చేర్చాలని నాకు బలంగా అనిపిస్తుంటుంది. వారoదరూ లేచి ముందడుగు వేస్తే తప్ప, `అమ్మ’  మేలుకోదు.

ప్రతి హిందువు, మరొకరికి సోదరుడే అని నేనంటాను.  `నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు’ అనాచారంతో మనమే వారిని ఈ అధ్వాన్న స్థితికి దిగజార్చాము. దానితో మొత్తం దేశo అజ్ఞ్యానo, పిరికితనంలో దిగజారిపోయి అధోగతి పాలయింది.  వీరందరినీ పైకి తీసుకురావాలి; ఆశ, విశ్వాసం కలిగించాలి. `మీరూ మాలాంటి మనుషులే, మాకున్న హక్కులు అధికారాలన్నీ మీకూ ఉన్నాయి’ అని మనం వారికి చెప్పాలి.

కుల సమస్యకు పరిష్కారం

పైనున్న శ్రేణులను క్రిందికి దించడం, పిచ్చి ఆవేశంలో ఏదిపడితే అది తిని తాగడం, హద్దులు దాటి ప్రవర్తించడం కులo ప్రశ్నకు సమాధానం కాదు, మన వేదాంత ధర్మం నిర్దేశించినట్లు నడుచుకోవడం, ఆధ్యాత్మికత సాధించి తద్వారా  ఆదర్శ బ్రాహ్మణుడిగా ఎదగడమే దీనికి పరిష్కారం. మీరు ఆర్యులైన, ఇతరులైనా, ఋషులు, బ్రాహ్మణులు లేక అత్యంత నిమ్న కులానికి చెందివారైనా, మీ పూర్వీకులచే మీ అందరిమీద విధించబడ్డ నియమం ఒకటుంది. అగ్రగామి వ్యక్తినుంచి అంటరాని వాడివరకు, మీ అందరికీ ఒకే ఆజ్ఞ్య,  ఆగకుండా ముందుకు పురోగమిస్తూనే ఉండాలి, దేశంలో ప్రతి ఒక్కరూ  ఆదర్శ బ్రాహ్మణుడిగా ఎదగడానికి కృషి చేయాలి. ఈ వేదాంత భావం ఇక్కడే కాదు, ప్రపంచమంతా వర్తిస్తుంది.

మానవాళికి ఆదర్శం  బ్రాహ్మణత్వమే అని శ్రీ శంకరాచార్యుల వారు తమ గీతా వ్యాఖ్యానానికి వ్రాసిన అద్భుతమైన ముందుమాటలో అన్నారు, ఈ బ్రాహ్మణత్వాన్ని సంరక్షిoచడానికే శ్రీ కృష్ణుడు గురువుగా అవతరించాడని అన్నారు. బ్రహ్మం అనబడే భగవంతుడికి చెందిన మనిషి బ్రాహ్మణుడు, ఆదర్శవంతుడు, పరిపూర్ణుడు, అతను వీడిపోకూడదు. ప్రస్తుతం కులంలో ఎన్ని లోపాలున్నా, బ్రాహ్మణత్వ లక్షణాలున్నవ్యక్తులు, మిగతా కులాలకన్నా ఎక్కువగా బ్రాహ్మణులనుంచే వచ్చారని మనం ఒప్పుకోక తప్పదు. వారి లోపాలు ఎత్తి చూపడానికి ధైర్యం చూపాలి, అలాగే వారికి చెందవలసిన గౌరవం కూడా ఇవ్వాలి.

కాబట్టి, కులాలమధ్య సంఘర్షణ వల్ల ప్రయోజనం లేదు. అది మనల్ని మరింత వేరు చేస్తుంది, ఇంకా బలహీనపరుస్తుంది, ఇంకా దిగజారుస్తుంది. పైనున్నవారిని క్రిందకు దించడం కాదు, క్రిందున్నవారిని పై స్థాయికి పెంచడంలోనే పరిష్కారం ఉంది. మన గ్రంథాల్లో అదే వ్రాయబడి ఉంది, ప్రాచీనుల ఉన్నత ప్రణాళిక, మేధాశక్తి కొంచెం కూడా అర్ధంకానివారు, తమ గ్రంథాలలోని  విషయాలు తెలియని పెద్దలు ఏమైనా చెప్పనీయండి. ఏమిటా ప్రణాళిక? ఒక చివరలో బ్రాహ్మణులు ఉంటే, మరొక చివరలో ఛoడాలురున్నారు, మన పని అంతా ఛoడాలులను బ్రాహ్మణుల స్థాయికి పెంచడమే, రానున్న కాలంలో నిమ్న కులాలకి మరిన్ని అధికారాలు, సౌకర్యాలు ఇవ్వడం మనం చూస్తాము.

ఈ ఆధునిక కాలంలో కూడా కులాల మధ్య ఇంత చర్చ జరగడం బాధాకరం, ఇది ఆగిపోవాలి. దీనివల్ల ఇరువైపులవారికి ఉపయోగం లేదు, ముఖ్యంగా బ్రాహ్మణులకి, ఎందుకంటే వారికి అధికారాలు పరపతులున్న రోజులు పోయాయి. ఉన్నత జమీందారీ వర్గాలు తమ గొయ్యి తామే తవ్వుకుoటారు, అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఎంత ఆలస్యం అయితే, అంతగా కుళ్లిపోయి, ఆ చావు మరింత భయంకరంగా ఉంటుంది. కాబట్టి భారత దేశంలో బ్రాహ్మణులు మిగతా మానవజాతిని ముక్తి మార్గంవైపు నడిపించాలి, ఆ పని జరిపించినపుడే, జరిపించినంత కాలమే, వారు బ్రాహ్మణులు.

బ్రాహ్మణుడని చెప్పుకునే వాడు, తన ఆధ్యాత్మికతను సాధించడమే కాక, ఇతరులను అదే స్థాయికి తీసుకురావాలి. స్వచ్చమైన, భగవంతుడిలాంటి మంచితనంతో కూడిన బ్రాహ్మణులను విశ్వమంతా తయారుచేయడమే, ఈ భారత దేశ ఆదర్శo, లక్ష్యమనే సంగతి మరచిపోరాదని మేము బ్రాహ్మణులకి విజ్ఞ్యప్తి చేస్తున్నాము. ఆదికాలంలో ఈ విధంగానే ఉండేదని మహాభారతం చెప్తుంది, ముగింపు కూడా ఇలాగే ఉంటుంది.     

ఉన్నత కులంలో పుట్టటంవల్ల అధికులమనే తప్పుడు భావం చాలామంది బ్రాహ్మణులలో ఉంది; మన దేశo వారైనా, విదేశీయులైనా వీరిని మాటలతో చేతలతో రెచ్చగొట్టి సులువుగా లోబరుచుకోవచ్చు.  బ్రాహ్మణులరా జాగ్రత్త, ఇది మరణానికి సంకేతం! లేవండి, లేచి మీ బ్రాహ్మణత్వాన్ని చూపించండి, మిగతా బ్రాహ్మణేతరులను పై స్థాయికి తీసుకురండి- కుహనా మేదావి లేక అహంకారపూరిత యజమాని లాగా కాదు, నిజమైన సేవా స్ఫూర్తితో.

బ్రాహ్మణులకి నా విజ్ఞ్యప్తి, వారికి వచ్చిన విద్య భారత ప్రజలకి నేర్పిoచి వారిని పైకి తీసుకురావడానికి కృషి చేయాలి, శతాబ్దాలుగా వారు కూడబెట్టిన సాoస్కృతిక సంపదను అందరికీ పంచాలి. బ్రాహ్మణత్వమంటే ఏమిటో భారతదేశ బ్రాహ్మణులు గుర్తు చేసుకోవడం వారి కర్తవ్యo.  మనువు అన్నట్లు, `ధర్మగుణం అనే సంపద ఉంది’ కాబట్టే  బ్రాహ్మణులకి ఈ అధికారాలు హోదా ఇవ్వబడ్డాయి. వారు ఆ ఖజానా తెరిచి ఆ సంపద అందరికీ పంచిపెట్టాలి.

భారత జాతులకి బ్రాహ్మణుడు ప్రథమ గురువు.  మిగతా వారికి ఆ ఊహకూడా రాకముందే, ఉత్కృష్టమైన మానవ జీవిత పరిపూర్ణతా సాధనకై, అన్నీ త్యాగం చేసిన ప్రథముడు.  మిగతా కులాలను దాటి ముందుకువెళ్ళడం అతని తప్పు కాదు. మిగతా వారు కూడా బ్రాహ్మణులలాగే అన్నీ అర్ధంచేసుకుని ఎందుకు ముందుకు వెళ్ళలేదు? బద్ధకంగా కూర్చుని ఉండిపోయి, బ్రాహ్మణులని పోటీలో ఎందుకు గెలవనిచ్చారు?

అయితే ఒక విషయంలో ప్రయోజనం పొందడం వేరు, దానిని భద్రపరచి చెడు ఉద్దేశాలకి వాడుకోవడం వేరు. అధికారం చెడు ఉద్దేశాలకి వాడితే అది దుష్టశక్తి అవుతుంది, అది మంచికి మాత్రమే వాడాలి.   అనాదిగా కూడబెట్టిన సాoస్కృతిక సంపదకు బ్రాహ్మణుడు ధర్మకర్త, అది ప్రజలకి పంచి ఇవ్వాలి; మొదటినుంచి ఈ ఖజానా తెరిచి ప్రజలకి పంచలేదు కాబట్టే ముస్లిం ఆక్రమణలు జరిగాయి, వేయి సంవత్సరాలపాటు  భారతదేశo మీద ఎవరు పడితే వారు దండయాత్రలు చేస్తే, వారి కాళ్ళక్రింద నలిగిపోయాము; ఆ కారణంగానే మనం ఇంత పతనమైనాము, మన ఉమ్మడి పూర్వీకులు పోగుచేసిన అద్భుతమైన సాoస్కృతిక సంపద ఉన్న ఖజానాను బద్దలుకొట్టడం మొట్టమొదటి పని, వాటిని బయటకు తెచ్చి అందరికీ పంచాలి, బ్రాహ్మణులే ఈ పని మొదట చేయాలి. బెంగాల్లో ఒక పాత నమ్మకo ఉంది, నాగుపాము అది కాటేసిన మనిషినుంచి విషం పీల్చేస్తే, ఆ మనిషి బ్రతుకుతాడు అని. అలాగే,  బ్రాహ్మణుడు తన విషాన్ని తనే పీల్చేయాలి.

బ్రాహ్మణేతర కులాలకు, నేను చెప్తున్నాను, ఆగండి, తొందర పడకండి. ప్రతి విషయంలోనూ ms, Animationబ్రాహ్మణులతో పోట్లాటకి తయారవకండి, ఎందుకంటే నేను వివరించినట్లు, మీ పొరపాట్ల మూలంగానే, మీరు బాధలకు గురి అయారు. సంస్కృత విద్య, ఆధ్యాత్మికత నేర్చుకోవడo ఎందుకు నిర్లక్ష్యం చేసారు? ఇంత కాలంగా ఎం చేస్తున్నారు? ఎందుకు ఉదాసీనంగా ఉండిపోయారు? ఇతరులకు మీకన్నా ఎక్కువ మేధస్సు, శక్తిసామర్ధ్యాలు, ధైర్యం ఉన్నాయని, ఎందుకు మీకు కోపం, అసహనం? పత్రికల్లో అనవసర చర్చలు పోట్లాటలు చేస్తూ, మీ ఇళ్ళల్లో పోట్లాడుకుంటూ మీ శక్తి వృధా చేసుకోకుండా, అదే సామర్థ్యాన్ని, బ్రాహ్మణులకున్న సంస్కృతిక వికాసాన్ని సంపాదించుకోవడానికి వినియోగించండి, అపుడు పని జరుగుతుంది. మీరెందుకు సంస్కృత పండితులు కావట్లేదు? సంస్కృత విద్యను దేశంలో అన్ని కులాలకు అందుబాటులోకి తేవడానికి ఎందుకు లక్షలు ఖర్చు పెట్టట్లేదు? అది అసలు ప్రశ్న. మీరు ఇవన్నీ చేసిన క్షణంనుంచీ మీరు బ్రాహ్మణులతో సమానమే! భారత దేశ రహస్య శక్తి ఇదే.

నిమ్న కులాలకు చెందిన పురుషుల్లారా, నేను చెప్తున్నాను, మీ స్థితి స్థాయి పెంచుకోవడానికి సంస్కృత విద్య ఒకటే మార్గం. అగ్ర కులాలతో పోట్లాటలు, వారికి వ్యతిరేకంగా కోపంగా వ్రాతలు ఇవన్నీ వ్యర్ధమైన పనులు, ప్రయోజనం లేదు, దీనివలన వైరం, వివాదo మరింత పెరుగుతాయి; దురదృష్టవశాత్తు, ఇప్పటికే విభజించబడిన ఈ జాతి మరింతగా విడిపోతుంది.  అగ్రకులాలకి ఉన్న విద్య, సంస్కృతులను స్వంతం చేసుకోవడం ద్వారా  మాత్రమే కులాల మధ్య సమానత సాధ్యమౌతుంది.

`భారతదేశం – సమస్యలపై స్వామి వివేకానంద’ పుస్తకం నుంచి పై వ్యాసం తీసుకోబడింది. 

The above is  Telugu translation of excerpt from the book – Swami Vivekananda on India and Her Problems

అనువాదం – ప్రదక్షిణ 

English Original