కామారెడ్డి జిల్లాలోని మండల కేంద్రం భిక్కనూరు, స్వయంభూ శివాలయం శ్రీ సిద్ధ రామేశ్వర క్షేత్రానికి ప్రసిద్ధి. ఈ ఊరిలో ఇప్పుడు ఒక మహత్తర కార్యం జరిగింది. శ్రీ కొడకండ్ల రామగిరిశర్మగారి సారధ్యంలో అక్కడి గ్రామస్థులoతా పూనుకొని, షుమారు 500సంవత్సరాల పురాతన దేవాలయాన్ని మరమ్మత్తులు చేసి, నూతన విగ్రహల స్థాపన చేసి పునరుద్ధరించారు. ఐదు రోజులపాటు దేవాలయ సంబంధిత విధులు శాస్త్రోక్తంగా వేద పండితుల ద్వారా సంపూర్ణమైనాయి. హరిహరక్షేత్రం – శ్రీ వెంకటేశ్వర స్వామి, శివ పంచాయతన దేవతల విగ్రహాల మరియు యంత్ర ప్రతిష్టాపన, దీప స్థంభ స్థాపన మహోత్సవం, సప్తమీ శుక్రవారం 26 ఏప్రిల్ 2019న జరిగాయి.
శిధిలమైన ఈ జీర్ణ ఆలయ పునస్థాపన పనులు, భిక్కనూరు బ్రాహ్మణ సేవాసమాజం పునరుద్ధరణ నిశ్చయంతో, గత సంవత్సరం ప్రారoభమైనాయి. అతి వేగంగా 8నెలల కాలంలోనే పనులు పూర్తి చేసారు. తిరుపతి వెళ్లి అక్కడి స్థపతుల చేత ఎంతో కళాత్మకoగా విగ్రహాలు చెక్కించారు. పంచాయతన సంప్రదాయానుసారంగా వెంకటేశ్వర స్వామి, శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, మరియు సూర్య దేవతా విగ్రహాల ప్రతిష్ట, యంత్ర మరియు దీపస్థoభ స్థాపన జరిగాయి. శ్రీ సిద్ధరామేశ్వర క్షేత్రానికి, ఈ హరిహర దేవాలయం అనుబంధంగా ఉండేది. 60సంవత్సరాల క్రితం విగ్రహాలు చోరీ అవకముందు వరకు, శ్రీ సిద్ధ రామేశ్వర క్షేత్రo నుంచి బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగింపు ఈ ఆలయానికి వచ్చేది.
శ్రీ సిద్ధరామేశ్వర క్షేత్రానికి 600సం. పై బడిన చరిత్ర ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం, దట్టమైన అడవిలో సిద్ధగిరి, రామగిరి అనే ఇద్దరు యోగులు, కపిల గోవు ఒకానొక ప్రదేశంలో పాల ధార కార్చడం చూసి, అక్కడ తవ్వగా స్వయంభూ మహాలింగo బయటపడింది, తిరిగి చూడగా గోవు మాయమైంది. ఈశ్వరుడు ఆ యోగులకి సాక్షాత్కరించి, ఒక తాళపత్ర గ్రంథాన్ని ఇచ్చి ఆ ప్రకారం దేవాలయ నిర్మాణం కావించమని కోరగా, ఈ స్వయంభూ సిద్ధ రామేశ్వర క్షేత్రం, కాకతీయ శిల్పకళా రీతిలో నిర్మించబడింది. హోలీ పౌర్ణమి ఐదు రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలో ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ, ఇద్దరు యోగుల సమాధుల వద్దకు వెళ్లి తిరిగి దేవాలయం చేరుకుంటుంది.
శ్రీ సిద్ధ రామేశ్వర క్షేత్రానికి, శ్రీ కొడకండ్ల రామగిరిశర్మగారు, వారి కుటుంబ సభ్యులు అనువంశిక అర్చకులు. ఆయన వేద పండితులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. తమది అర్చక వంశం అవడంవల్ల, శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమానికి పూనుకున్నామని, కులమతాలకు అతీతంగా గ్రామస్థులంతా సాయం చేసి చేయూత నిచ్చారని తెలిపారు. ఒక జీర్ణ ఆలయ పునరుద్ధరణ, నూరు ఆలయాల నిర్మాణంతో సమానమని అన్నారు. శిధిలమైన పురాతన దేవాలయాలు, పూజకు నోచుకోని దేవాలయాల పునరుద్ధరణ చాలా పుణ్యకార్యమని, అది సంఘానికి, రాష్ట్రానికి, దేశానికి ఎంతో క్షేమకరం, వృద్ధికరం, శ్రేయస్కరమని తెలిపారు.