రోహింగ్యా అక్రమ వలసలు… భద్రతకు సవాలు!

రోహింగ్యాలను వెనక్కి పంపాల్సిందే

శరణార్థుల స్థితిగతులపై 1951నాటి అంతర్జాతీయ తీర్మానంపై భారత్‌ సంతకం చేయలేదు. శరణార్థులను వెనక్కి తిప్పి పంపరాదన్న నిబంధన ఆ తీర్మానంలోనే ఉంది. శరణార్థుల పట్ల అనుసరించాల్సిన విధివిధానాలపై 1967లో కుదిరిన ‘ప్రొటోకాల్‌’నూ మన దేశం ఆమోదించలేదు. కాబట్టి ‘సమితి’ నేతృత్వంలో శరణార్థులకు సంబంధించి కుదిరిన ఒడంబడికలు, తీర్మానాలతో భారత్‌కు సంబంధమే లేదు. అలాంటప్పుడు 1951నాటి తీర్మానానికి కట్టుబడి రోహింగ్యాలను వెనక్కి తిప్పి పంపరాదు… అనే వాదనకు అర్థమే లేదు!

వీళ్లకు దేశం పట్టదు, జాతి సంక్షేమం గిట్టదు, 130 కోట్ల భారత ప్రజల భద్రత ఏ గాలిలో కలిసినా వీరి తలకెక్కదు! మానవ హక్కుల పేరిట మొసలి కన్నీళ్లు కార్చే ఈ నయా ఉదారవాదులకు కావలసిందల్లా అయినదానికీ కానిదానికీ ప్రభుత్వాన్ని పట్టుకుని తిట్టిపొయ్యడం! పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న వేల సంఖ్యలోని రోహింగ్యాలు భారత్‌లోకి అక్రమంగా వలసవస్తే- వారి తరఫున వకాల్తా పుచ్చుకొని గొంతు చించుకుంటున్నవారిది పూర్తి బాధ్యతారాహిత్యం.

ఉగ్రవాదులతో సంబంధాలున్న రోహింగ్యాలు భారత్‌లో అక్రమంగా స్థిరపడితే జాతి భద్రతకు తూట్లు పడతాయి. దేశ పౌరుల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోతుంది. జాతి భవిష్యత్తు దారుణ ప్రమాదంలో పడినా కించిత్తు కూడా బాధపడని ఈ పేరుగొప్ప మానవతావాదులు- భారత పౌరుల సంక్షేమం కన్నా రోహింగ్యాల బాగోగులే తమకు ముఖ్యమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

ఇది ఘోరం… నేరం!

రోహింగ్యాలకు మద్దతుగా వినిపిస్తున్న వాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు, వాదనలు ప్రచారంలోకి వస్తున్నాయి. రోహింగ్యాలు భారత్‌లోకి కేవలం శరణార్థులుగా మాత్రమే ప్రవేశించారని, వారిని ‘అక్రమ వలసదారులు’ అనడం సబబు కాదన్న వాదనను కొందరు బలంగా వినిపిస్తున్నారు. అంతర్జాతీయ ఒడంబడికలకు కట్టుబడి రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందన్నది వారి వాదన. ఐక్యరాజ్య సమితి సారథ్యంలో కుదిరిన ఒడంబడికలపై భారత్‌ సంతకం చేసిందని, దాని ప్రకారం శరణార్థులను వెనక్కి తిప్పి పంపడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని, కాబట్టి రోహింగ్యాలను అక్కున చేర్చుకోవాలని వీరు వాదిస్తున్నారు. అయితే ఆ వాదన పూర్తిగా సత్యదూరం. రోహింగ్యాలు శరణార్థులు కాదు. కాబట్టి శరణార్థులకు ఉండే హక్కులు వారికి వర్తించవు! లక్షల సంఖ్యలో బంగ్లాదేశీయులు భారత్‌లోకి అక్రమంగా జొరబడి దేశవ్యాప్తంగా పాకిపోయారు. రోహింగ్యాలు ఏ రకంగానూ అందుకు భిన్నం కాదు.

రోహింగ్యాలను తిప్పి పంపడం రాజ్యాంగంలోని మూడో భాగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని కొందరు వాదిస్తున్నారు. మన రాజ్యాంగం ప్రవచించిన ప్రాథమిక హక్కులు చాలావరకు భారత పౌరులకే వర్తిస్తాయి. అక్రమంగా దేశంలోకి చొచ్చుకు వచ్చిన వారంతా తమకు ఆ హక్కులు వర్తింపజేయాలని వాదించడం అర్థరహితం! రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు ‘వ్యక్తుల’(పర్సన్స్‌)కు వర్తిస్తాయని- అత్యధిక నిబంధనలు ‘పౌరుల’(సిటిజెన్స్‌)కు అనువర్తిస్తాయనీ లిఖించారు. ఈ చిన్నపాటి తేడాను తమకు అనుకూలంగా మలచుకోవడానికి రోహింగ్యాల అనుకూలురు ప్రయత్నిస్తున్నారు. పౌరులకు వర్తింపజేసే హక్కులను అక్రమ చొరబాటుదారులకూ కల్పించాలని అడ్డంగా వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని 14వ అధికరణ, చట్టం ముందు అందరూ సమానులేనని చెబుతోంది. ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి 21వ అధికరణం ప్రస్తావిస్తోంది. ఈ రాజ్యాంగ అధికరణలు ‘వ్యక్తులంద’రికీ వర్తిస్తాయి కాబట్టి- ఆ మేరకు రోహింగ్యాలకూ రక్షణ కల్పించాలన్న వాదన పూర్తిగా కొట్టిపారేయలేనిదే. అయితే సరిహద్దులు దాటుకుని దేశంలోకి చొరబడిన అక్రమ వలసదారులందరికీ- భారత పౌరులకు వర్తింపజేసే హక్కులు ఉండాలనడం అసమంజసం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతోపాటు- దేశంలో ఏ ప్రాంతానికైనా నిరభ్యంతరంగా వెళ్ళేందుకు, నివాసం ఉండేందుకు, స్థిరపడేందుకు రాజ్యాంగంలోని 19వ అధికరణ వీలు కల్పిస్తోంది. భారత పౌరులకు మాత్రమే పరిమితమైన హక్కులు ఇవి! ఈ హక్కులను చొరబాటుదారులకూ కల్పించాలనడం అహేతుకం, అర్థరహితం! దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించడం భారత ప్రభుత్వ బాధ్యత. అక్రమ చొరబాటుదారుల కారణంగా జనాభా స్వరూప స్వభావాల్లో; సామాజిక, ఆర్థిక రంగాల్లో తలెత్తే సమస్యలనుంచి పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా భారత ప్రభుత్వంపై ఉంది. పైపెచ్చు ‘విదేశీయుల చట్టం’ ప్రకారం అక్రమంగా వలసవచ్చిన ప్రతి ఒక్కరినీ దేశంనుంచి బయటకు పంపివేయడం ప్రభుత్వ విధి!

చేదు నిజాలు

దేశ సరిహద్దుల వెంబడి అన్ని చోట్లా కంచె లేదు. దురదృష్టవశాత్తూ చాలావరకు మన సరిహద్దులు చొరబాట్లకు వీలు కల్పించేవిగానే ఉన్నాయి. ఫలితంగా గడచిన కొన్ని దశాబ్దాలుగా దేశం అక్రమ చొరబాట్ల తాకిడికి గురవుతోంది. ఈ చొరబాట్ల కారణంగా సరిహద్దులను ఆనుకుని ఉన్న వివిధ జిల్లాల్లో సామాజిక వర్గాల సమతుల్యత గణనీయంగా మారిపోతోంది. దాదాపుగా ఈ జిల్లాలన్నింటినీ చొరబాటుదారులు ఆక్రమించేశారు. ఫలితంగా కనీస సౌకర్యాలు అందుబాటులో లేని, ప్రాథమిక హక్కులకూ నోచుకోని దురవస్థలో అక్కడి భారతీయ పౌరులు దుర్బర స్థితి అనుభవిస్తున్నారు. ఉగ్రవాద మూకలతో ఈ చొరబాటుదారులు నేరుగా సంబంధాలు నెరపుతూ దేశంలో సృష్టించిన హింసాకాండ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వేల సంఖ్యలో దేశ పౌరులు, భద్రతా దళాలను ఈ మూకలు పొట్టనపెట్టుకున్నాయి.

రోహింగ్యాలవల్ల దేశ భద్రత తీవ్ర ప్రమాదంలో పడుతుందనేందుకు చాలినన్ని ఆధారాలున్నాయి. భారతీయ భద్రతా సంస్థలు ఆ మేరకు పూర్తి సాక్ష్యాలు సేకరించాయి. పాకిస్థానీ ఉగ్ర సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న కొందరు రోహింగ్యాలు- సరిహద్దుల ఆవలనుంచి అందుతున్న సంకేతాల ప్రకారమే జమ్ము, దిల్లీ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు తరలివెళ్ళినట్లు భారతీయ భద్రతా విభాగాలవద్ద సమాచారం ఉంది. ఇలాంటివారివల్ల దేశ అంతర్గత భద్రత పెను ప్రమాదంలో పడుతోంది. నకిలీ గుర్తింపు కార్డులు, పత్రాలతో దేశంలో ఇష్టానుసారం సంచరిస్తున్న ఈ రోహింగ్యాలు- హవాలా మార్గాల ద్వారా భారీయెత్తున నిధులనూ సమకూర్చుకుంటున్నట్లు వివరాలు ఉన్నాయి. రోహింగ్యాలను వెనక్కి తిప్పి పంపడం అమానవీయమని గొంతు చించుకుంటున్నవారు గుర్తించాల్సిన వాస్తవాలివి. మియన్మార్‌లోని రఖైన్‌ ప్రాంతంలో ఏం జరిగిందన్న దాన్ని గమనిస్తే కఠిన సత్యాలెన్నో వెలికివస్తాయి. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రెటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ సారథ్యంలో రఖైన్‌ ప్రాంత పరిణామాలపై నియమితమైన సలహా సంఘం వెలువరించిన నివేదిక ఎన్నో విషయాలను లోతుగా విశ్లేషించింది. సంఘర్షణకు దారితీసిన చారిత్రక కారణాలను విపులంగా చర్చించింది. 1948లో స్వాతంత్య్రం పొందిన వెన్వెంటనే మియన్మార్‌లోని రఖైన్‌లో ముస్లిం ముజాహిదీన్‌లు తిరుగుబాటు లేవదీశారు. సమాన హక్కులతోపాటు తమ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్లతో మోసులెత్తిన తిరుగుబాటు అది’ అని కోఫీ అన్నన్‌ నివేదిక చరిత్ర మూలాలను కళ్లముందు ఉంచింది. మియన్మార్‌ ప్రభుత్వం ఆ తిరుగుబాటును అణచివేసింది.

ఆ నేపథ్యంలోనే రోహింగ్యా సంఘీభావ సంస్థ(ఆర్‌ఎస్‌ఓ) సాయుధ పోరాటానికి తెరలేపింది. హర్కత్‌ అల్‌ యకీన్‌ (తదనంతర కాలంలో ఇది అరాకన్‌ రోహింగ్యా విముక్తి సైన్యం (ఏఆర్‌ఎస్‌ఏ)గా మారింది) దేశ భద్రతా దళాలపై 2016 అక్టోబరులో పెద్దయెత్తున విరుచుకుపడింది. ‘ఆధునిక చరిత్రలో ప్రభుత్వ దళాలపై జరిగిన అతిపెద్ద ముస్లిం దాడి’గా దీన్ని కోఫీ అన్నన్‌ అభివర్ణించారు. సొంత సైన్యాలను రూపొందించుకుని, ఆయుధాలు తయారు చేసుకొని మతోన్మాదంతో దాడులకు తెగబడిన, ఏకంగా ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించిన ఇలాంటి రోహింగ్యాలను దేశంలోకి అనుమతించాలనడం ఎంతవరకు సబబు? అలాంటి మూకలకు మన గడ్డపై స్థానం కల్పిస్తే దేశ భద్రత ఏం కావాలి? ఇప్పటికే అనేక సమస్యల్లో ఉన్న దేశానికి మరో కొత్త సమస్యను నెత్తిన మోయడం అవసరమా?

భారత పౌరులే తొలి ప్రాథమ్యంగా…

ఏ దేశానికీ చెందని జనం పెద్దయెత్తున మియన్మార్‌లో జీవిస్తున్నట్లు కోఫీ అన్నన్‌ నివేదిక స్పష్టం చేసింది. పౌరసత్వ సమస్యను సాధ్యమైనంత సత్వరం పరిష్కరిస్తే తప్ప మియన్మార్‌లో మత ఘర్షణలు సద్దుమణగవనీ అన్నన్‌ సూచించారు. ఈ సమస్యను పట్టించుకోకుండా అలాగే వదిలి వేస్తే మనుషుల మధ్య అంతరాలు మరింత పెరుగుతాయని, మానవతా సంక్షోభం ముమ్మరిస్తుందని, అభద్రత ప్రబలుతుందనీ కోఫీ అన్నన్‌ నివేదిక హెచ్చరించింది. భారత ప్రభుత్వం అన్నన్‌ నివేదికలో ప్రస్తావించిన అంశాలకు సంపూర్ణ మద్దతు పలికింది. శాంతియుత సహజీవనం, భిన్న వర్గాలమధ్య అవగాహన, న్యాయం, హుందాతనం, ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి రోహింగ్యాల సమస్యను పరిష్కరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆ మేరకు భారత్‌ క్రియాశీలంగా స్పందించింది. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలకోసం అత్యవసర సామగ్రిని, ఆహార పదార్థాలను భారీయెత్తున తరలించింది. సమస్యలు, సంక్షోభాల్లో చిక్కుకున్న ప్రజాసమూహాలతో భారత్‌ ఎప్పుడూ అత్యంత మానవీయంగానే వ్యవహరించింది. అలాంటి వారిని ఆదరించి అక్కున చేర్చుకొంది. అయితే దేశ పౌరులను కాపాడుకోవడం భారత ప్రభుత్వ ప్రాథమిక విధి. భారత పౌరుల రక్షణకు విఘాతం కలించే ఏ విధానమైనా అహేతుకమైనదే! కాబట్టి పౌర భద్రతకు తొలి ప్రాధాన్యమిచ్చి- పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోకముందే రోహింగ్యాలను ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపాలి.

(శుక్రవారం, అక్టోబర్ 06, 2017, ఈనాడు దినపత్రిక సౌజన్యం తో…)

 

(రచయితడా. ఎ. సూర్యప్రకాశ్, ప్రసార భారతి అధ్యక్షులు).

Rohingya Issue: National Security Must Prevail (In English)

1 thought on “రోహింగ్యా అక్రమ వలసలు… భద్రతకు సవాలు!

  1. Pingback: Rohingya Issue: National Security Must Prevail | Arise Bharat

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s