హిందుత్వంలోకి పునరాగమనం గురించి – స్వామి వివేకానంద ;
(ప్రబుద్ధ భారతి ..ఏప్రిల్ 1899 లో ప్రచురించబడింది.)
ఎడిటర్ గారి కోరిక మేరకు “మతమార్పిడులు– హిందుత్వం ” అనే అంశం పై స్వామి వివేకానంద గారితో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. గంగాతీరంలోని శ్రీ రామకృష్ణ మఠం దగ్గర ఒక గంగ హౌస్ బోట్ లో చీకటిపడుతున్నవేళ స్వామి నాతో మాట్లాడటానికి వచ్చారు.
ఈ సమావేశానికి సమయం, ప్రదేశం చాలా అద్భుతంగా కుదిరాయి. తలమీద ఆకాశంలో అంతులేని నక్షత్రాలు,చుట్టూరా చల్లని గంగా ప్రవాహం, పక్కనే సన్నని వెలుగులతో శ్రీ రామకృష్ణ మఠం ఆశ్రమం, ఆ వెనుకే పొడవైన, దట్టమైన వృక్షాలు.
“నేను మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను స్వామీ” ముందుగా నేనే సంభాషణ మొదలుపెట్టాను.
“హిందుత్వం నుండి దూరమైనవారు తిరిగి మరల దీనిలో ప్రవేశించాలనుకోవడం గురించి మిమ్మల్ని అడగలనుకుంటున్నాను.””మీ అభిప్రాయంలో వారిని తిరిగి తీసుకోవచ్చంటారా?”
“తప్పకుండా!” అన్నారు స్వామి.”తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా!”
ఆయన దీర్ఘంగా శ్వాస తీసుకొని వెనక్కివాలి ఒక్క క్షణం విరామం తీసుకున్నారు.
“అయితే” అంటూ మళ్ళీఇలా అన్నారు.
“అలా తీసుకోకపోతే మన సంఖ్య ఇంకా తగ్గిపోతుంది.” మహమ్మదీయులు ఈ దేశానికి వచ్చినపుడు, ఒక వృద్ధ మహ్మదీయ చరిత్రకారుడు” ఫరిష్తా ” అప్పటికి ఆరువందల మిలియన్ల హిందువులు ఉన్నట్లుగా చెప్పాడు” .” ప్రస్తుతం మనం రెండువందల మిలియన్లు మాత్రమే ఉన్నాము. అంతేకాక, హిందుత్వంలో నుండి బయటకు వెడుతున్న ప్రతి వ్యక్తీ, ఒక మనిషిగా లెక్కకంటే ఒక శత్రువుగా మారడం విచారకరం.”
“అయితే అది అప్పుడు అధికారబలం తో ఉన్నవారు కత్తులు చూపించి బెదిరించడం వల్ల ఇస్లాంలోకి, క్రైస్తవం లోకి వెళ్లిన వారు, వారి వారసులు సంగతి. ఇది నిజానికి వారి పట్ల చాలా అన్యాయమైన విషయం. అయితే ఇలా సమూహాలుగా ఎక్కువమందిని మతం మార్చడం ఇప్పటికీ ఎందుకు జరుగుతోందంటారు?”
“నా అభిప్రాయంలో ఈ వివరణ భారత దేశానికీ అవతల ఉన్న జాతులకే కాదు, ఇంకా ఇతర తెగల వారికీ వర్తిస్తుంది. ఇది మనపై దండెత్తి వచ్చిన అనేక రకాల జాతులవారి విషయంలో జరిగింది. మహమ్మదీయ దురాక్రమణల ముందు కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. అయితే స్వచ్ఛందంగా మారినవారిని ఏమి చేయలేము కానీ, కేవలం దురాక్రమణ ద్వారా బలవంతంగా మతం మార్చబడిన కాశ్మీర్, నేపాల్ వంటి ప్రాంతాలలో ప్రజలు, ఇంకా ఇతర వ్యక్తుల విషయంలో ఏ విధమైన ప్రాయశ్చిత్తాలు లేకుండానే వారిని తిరిగి స్వీకరించాలి.”
నా తరువాతి ప్రశ్న సిద్ధంగా ఉంది. “అయితే మరి వీరందరినీ ఏ కులానికి చెందినవారిగా భావించాలి స్వామీ.” “వీరిలో చాలామంది లేదా కొంత మంది ఈ అతి పెద్ద హిందూ సమూహాల ద్వారా ఆదరింపబడకపోవచ్చు. అలాంటి సందర్భాలలో మరి వీరికి సరైన స్థానం ఏదని మీరు అంటారు?”
“తిరిగి వచ్చిన వ్యక్తులు తిరిగి వారి వారి పాత ధర్మాలకే చెందుతారు. మరల వీరిలో ఎవరైనా కొత్తవారు ఉంటే వారు వారికి ఇష్టమైన కులాన్ని అవలంబించవచ్చు. ” “నీకు గుర్తుందా! ఇది భారతీయ సనాతన వైష్ణవ సంప్రదాయంలో ఎప్పటినుండో ఉన్నది. వివిధ జాతులు,వర్గాల నుండి హిందుత్వంలోకి మారిన వారందరినీ ఏకత్రితమ్ చేసి ఒకే ధ్వజం క్రిందకు తీసుకు రావడం జరిగింది. ఇది చాలా గౌరవప్రదమైన విధానం కూడా .” సనాతన రామానుజాచార్యులవారి నుండి బెంగాల్ కి చెందిన ఆధునిక యోగి చైతన్యప్రభువు వరకు ఉన్న వైష్ణవ గురువులందరూ ఈ సంప్రదాయాన్నేఅనుసరించారు. “
” మరి ఇలా వచ్చిన వారి వివాహాలు ఎక్కడ, ఎలా జరగాలంటారు?”
“వారిలో వారు చేసుకుంటారు.ఇప్పుడలాగే జరుగుతున్నది కదా!”ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు స్వామి.
“మరి ఐతే వారి పేర్లు ఎలా ఉండాలి?” “ఇతర జాతులు, మతాల నుండి మారిన ఈ హిందువులు కాని వార్ల పేర్లను మార్చి కొత్త పేర్లు ఇవ్వాలి కదా! మరి వారికి కులాల వారీగా పేర్లను ఇస్తారా లేదా మరేమైనా చేస్తారా!”
“తప్పకుండా”, అన్నారు స్వామి. “పేరులో చాలా విశేషతలు ఉన్నాయి. కనుక మార్చక తప్పదు” అన్నారు సాలోచనగా.
ఇక ఈ విషయంపై ఆయన సంభాషణ పొడిగించలేదు.
నా తరువాత ప్రశ్న మళ్ళీ వచ్చింది.”ఇలా వచ్చిన కొత్త వాళ్ళని మీరు హిందుత్వంలోని అనేక రకాలైన ఆరాధనా విధానాల్లో ఏ విధానాన్నైనా అనుసరించవచ్చని వదిలేస్తారా లేదా మీరే వారికి ప్రత్యేకమైన విధానం ఏదైనా సూచిస్తారా?”
“అసలు ఈ ప్రశ్న ఎలా అడిగావు నువ్వు ?”అన్నారు స్వామి.”వారు స్వయంగా వారి విధానాలను నిర్ణయించుకుంటారు.అలా కానప్పుడు అసలు హిందుత్వ భావనే దెబ్బతింటుంది.అసలు మన ప్రాచీన హిందూ ధర్మం యొక్క సారాంశమే అది.దీని ప్రకారం ప్రతి వ్యక్తీ తనకు ఇష్టమైన విధానంలోనే ధర్మాచరణ చేస్తారు.”
నాకు ఈ చర్చ చాలా ప్రభావవంతమైనదని అన్పించింది.నా ముందు కూర్చున్న ఈ వ్యక్తి అనేక సంవత్సరాలుగా ఈ దేశంలోని ప్రజల మధ్య గడుపుతూ హిందుత్వంలోని మూలమైన ధర్మాలను అర్థం చేస్కుని ఆచరిస్తున్నారు. ఇందులోని సాధారణ నియమాలను, విధానాలను శాస్త్రీయంగా,సానుకూల దృక్పధంతో విశ్లేషించి ప్రజలకు వివరిస్తున్నారు.
స్వామి చెప్పిన ‘ఇష్టమైన విధానాలను అనుసరించే స్వేఛ్చ” అనే భావన ప్రపంచమంతటినీ తనలో ఇముడ్చుకోగల విశిష్టమైన సంస్కారం. అదే ఈ సనాతన ధర్మం యొక్క గొప్పదనం.
తరువాత మా సంభాషణ ఇంకా చాలా విషయాలపై సాగింది.చివరగా ఈ అద్భుతమైన స్వధర్మ ప్రభోధకుడు నాకు శుభరాత్రి చెప్పి తన చేతిలోని లాంతరుతో ప్రశాంతంగా మళ్ళీ ఆశ్రమం లోకి వెళ్లిపోయారు. నేను గంగా నదిలో ప్రయాణిస్తూ అందమైన అలలతో ఆమె గీస్తున్న చిత్రాలను ఆస్వాదిస్తూ తిరిగి కలకత్తాకు చేరుకున్నాను.