ఇటివలే డిసెంబర్ 2018లో ఎన్నికైన తెలంగాణా శాసనసభలో, 11కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలను తమ పార్టీ వైపు మళ్లిoచుకోవడానికి తెరాసకు ఎక్కువ సమయం పట్టలేదు, మూడు-నాలుగు నెలలలోనే ఈ ఘనతని కేసిఆర్ గారు సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలం పదికి పడిపోయింది, కాబట్టి వారికి విపక్ష పార్టీ హోదా కూడా పోతుంది. మిత్ర పక్షమైన మజ్లిస్ పార్టీతో కలుపుకుని తేరాసకి విధానసభలో ఎదురులేనట్లే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన-తెలంగాణా రాష్ట్రo ఏర్పాటు సమయంలో- 2014 ఎన్నికలలో కూడా తెరాసకు 2018 ఎన్నికలలో వచ్చిన మెజారిటి రాలేదు. అప్పుడు కేవలం 63 సీట్లు మాత్రమే వచ్చాయి, ఆ తరువాత 1-2 సంవత్సరాలలోపు, ఇతర పార్టీలనుంచి దాదాపు 25 మంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను తెరాసలో చేర్చుకున్నారు. కొందరికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఫిరాయింపుదారుల చట్టం క్రింద కోర్టులో, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కేసులు దాఖలు చేసినా, వాటికి అంతుపంతూ లేకపోయాయి. ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు ఈ అవినీతిని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి.
ఈ చరిత్ర తెలిసీకూడా, అంటే తెరాసకి వ్యతిరేకంగా ఇతర పార్టీలకు పడ్డ వోట్లు, తిరిగి తెరాస పార్టీకే వస్తాయని తెలిసీ, తెలంగాణా ప్రజలు, పార్టీ ఫిరాయించని ప్రతినిదులకి, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలకు వోట్లు వేస్తే బాగుండేది. డిసెంబర్ 2018 విధానసభ ఎన్నికల సమయంలో, ఇరవై లక్షలకు పైగా వోటర్ల పేర్లు గల్లoతైనపుడు కూడా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వo మరియు ఎన్నికల కమిషన్ పైనా విమర్శలు వెల్లువెత్తాయి, అయినా రీ-పోలింగ్ కూడా నిర్వహించలేదు. తిరిగి వెంటనే ఈ పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పూర్తి ఉల్లంఘన జరుగుతోంది.
గతంలో ఫిరాయింపులపై ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు తీర్పులు వెలువరించడంలో విఫలమైయాయి కాబట్టి, ఈ తాజా వ్యవహారంలో రాజ్యాంగ పరిరక్షణ చర్యలు ఎవరు తీసుకుంటారు? ప్రజల తీర్పును పక్కకు పెట్టి, ఫిరాయిoపుదారులు పార్టీలు మారిస్తే, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య కాదా? ప్రజాస్వామ్యoలో ఎన్నికలు అత్యంత కీలకం, ఆ ఎన్నికల ఫలితాలనే తారుమారు చేస్తే, మన దేశ ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉండగలుగుతుందా?
ప్రదక్షిణ